అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 22 వేల మంది భారతీయులు

296

తమ వీసా అనుమతులు ముగిసిన తరువాత కూడా ఇంకా వేల మంది భారతీయులు అమెరికాలో గడుపుతున్నారని అక్కడి డిపార్టమెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ ఎస్) వెల్లడించింది. బుధవారం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 21 వేలమంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారట. 2017 చివరి నాటికి వారందరి వీసా గడువు ముగిసిపోయినా ఇంకా అక్కడే అక్రమంగా ఉన్నారట.

కొన్ని ఇతర దేశాలతో పోల్చితే ఇలా అక్రమంగా ఉంటున్న భారతీయుల శాతం తక్కువే అయినా సంఖ్యాపరంగా ఎక్కువ ఉండడంతో ఇలాంటి దేశాల జాబితాలో మొదటి పది స్థానాల్లో ఉంది.

డీహెచ్ ఎస్ తాజా వార్షిక నివేదిక ప్రకారం 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు మధ్య వాయు – జల – రోడ్డు మార్గాల్లో అమెరికాకు వచ్చినవారిలో 701900 మంది తమ వీసా కాలపరిమితి ముగిసినా అమెరికాలోనే అక్రమంగా తిష్ఠ వేశారని తేల్చింది. ఈ కాలంలో 10.7 లక్షల మంది భారతీయులు బీ-1 – బీ-2 వీసాలపై అమెరికా వెళ్లారు. వ్యాపార – సందర్శక – పర్యటక వీసాలపై ఇలా వచ్చిన వారిలో 14204 మంది తమ వీసా టైం అయిపోయిన తరువాత కూడా స్వదేశానికి తిరిగి వెళ్లలేదు. అయితే.. కొద్దికాలం తరువాత వీరిలో 1708 మంది వెళ్లిపోయారని ఈ నివేదిక ప్రస్తావించింది. దీంతో ఇంకా 12496 మంది అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నట్లు తేలిందని డీహెచ్ ఎస్ వెల్లడించింది.

మరోవైపు విద్యార్థి వీసాలపై వచ్చిన 127435 భారతీయ  విద్యార్థులు రీసెర్చి స్కాలర్లలో 4400 మంది వీసా గడువు దాటినా అక్కడి నుంచి వెంటనే కదల్లేదట. మెల్లమెల్లగా కొందరు కదలగా ఇంకా 2833 మంది ఇప్పటికీ అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నారు. ఇక నాన్ ఇమ్మిగ్రేషన్ క్యాటగిరీలో 4 లక్షల మందికిపైగా వెళ్లగా అందులోఇంకా 6612మంది అక్రమంగా ఉంటున్నారు. మొత్తం మూడు క్యాటగిరీల్లో చూస్తే 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు మధ్య అమెరికా వెళ్లినవారిలో 21941 మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు తేలింది.