రివ్యూ : భైరవగీత

130
Bhairava Geetha
Bhairava Geetha

నటీనటులు : ధనుజయ్, ఇర్ర మోర్,రాజా బల్వాడి తదితరులు.
దర్శకత్వం : సిద్ధార్థ
నిర్మాతలు : అభిషేక్ నామా, భాస్కర్ రసీ
సంగీతం : రవి శంకర్
సినిమాటోగ్రఫర్ : జగదీష్ చీకేతి
ఎడిటర్ : అన్వర్ అలీ
నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందింన చిత్రం ‘భైరవగీత’. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :
రాయలసీమ నేపధ్యంలో సాగే ఓ హింసాత్మక ప్రేమకథ ఈ ‘భైరవగీత’. తక్కువ కులంలో పుట్టిన భైరవ (ధనుంజయ్) ఆ ఊరికి పెద్ద అయిన పెద్ద కులం అయిన సుబ్బా రెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. భైరవ తాతల దగ్గర నుంచి ఇలా తరతరాలకు సుబ్బా రెడ్డి కుటుంబానికి బానిసలుగానే ఉంటుంటారు. ఈ క్రమంలో సుబ్బా రెడ్డి కూతురు గీత (ఇర్ర మోర్) పై సుబ్బా రెడ్డి శత్రువులు అటాక్ చేస్తారు. భైరవ ప్రాణాలకు తెగించి గీతను కాపాడతాడు. దాంతో అన్నీ సినిమాల్లో లాగానే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య భైరవ తమ బానిస బతుకులను మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? వారి పై ఎలా తిరుగుబాటు చేశాడు ? చివరకి భైరవ మరియు గీత కలుస్తారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :
దర్శక రచయితలూ రాసుకున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. సినిమాలో మరీ అవసరానికి మించి వైలెన్స్ ఎక్కువైపోయింది. కథలో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో బలహీనమైన పాత్రలతో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు కథనంలో అనవసరమైన వైలెన్స్ ను ఫైట్స్ ను పెట్టి విసిగిస్తాడు.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో.. ప్రేక్షకులను ఇటు పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే లవ్ ఉండదు, అటు పూర్తిగా ఆకట్టుకునే యాక్షన్ ఉండదు. ఓవరాల్ అవసరానికి మించి హింసాత్మక సన్నివేశాలు ఎక్కువైపోవడం, కథ కథనాలు ఆకట్టుకోకపోవడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది. పైగా చంటి, ఒసేయ్ రాములమ్మ చిత్రాల ఛాయలు ఈ సినిమాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అయినా హీరోగా ధనుంజయ్ తన నటనతో ఆకట్టుకున్నా.. దర్శకుడు ఈ సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు

నటీనటులు :
ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుంజయ్ తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ ఫాదర్ సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో గాని, ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో గాని ధనుంజయ్ చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన ఇర్రా మోర్ కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఇక ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో బలహీనమైన పాత్రలతో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు బాగానే ప్రయత్నించాడు. హీరోయిన్ కి ఫాదర్ గా నటించిన నటుడు కూడా బాగా నటించాడు. ఆయన తిడుతూ పలికిన మాటలు బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

టెక్నీషియన్స్:
సినిమాలో దర్శకుడు సిద్దార్థ చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. కథ కథనాలు చాలా రెగ్యూలర్ గా సాగుతూ విసిగిస్తాయి. దీనికి తోడు మోతాదుకి మించి హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడు రవి శంకర్ సమకూర్చున పాటలు పర్వాలేదనిపిస్తాయి.

ఈ సినిమాకి జగదీష్ చీకేతి సినిమాటోగ్రఫీనే హైలెట్ గా నిలుస్తోంది. లొకేషన్స్ అన్ని బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. జగదీష్ చీకేతి వాటిని తెరకెక్కించిన విధానం కూడా చాల బాగుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలో కథకు అవసరం లేకుండా వచ్చే కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ఈ చిత్ర నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువులు బాగున్నాయి.

చివరిగా :
నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా తెరకెక్కపోగా.. నిరుత్సాహ పరుస్తోంది. చంటి, ఒసేయ్ రాములమ్మ చిత్రాలను కలిపి కథ అల్లితే భైరవ గీత గుర్తుకు రావడం బాధాకరం. కానీ ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుంజయ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. అయితే దర్శకుడు ఈ సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని హింసాత్మక సన్నివేశాలతో, ప్లో లేని స్క్రీన్ ప్లే తో, చాలా చోట్ల లాజిక్ మిస్ అవ్వడం లాంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోదు.