సమీక్ష : ‘మారి 2’ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా !

101
Maari2 (Dhanush, Sai Pallavi)

నటీనటులు : ధనుష్, సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు.
రేటింగ్ 2/5
దర్శకత్వం : బాలాజీ మోహన్
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫర్ : ఓంప్రకాష్
స్క్రీన్ ప్లే : బాలాజీ మోహన్
ఎడిటింగ్: ప్రసన్నా జీకే
నిర్మాత: ధనుష్

బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘మారి 2’. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించగా ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మించింది. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :
మారి (ధనుష్)కి ఎవ్వరూ ఉండరు. తనూ కూడా ఎలాంటి బంధాలు పెట్టుకోకుండా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాడు. అయితే మారి, జగన్ మంచి ఫ్రెండ్స్. వైజాక్ లోని ఒక ఏరియాలో వీరు గ్యాంగ్ నడుపుతారు. వీరికి మరియు మరో గ్యాంగ్ కి పోటాపోటీగా ఉంటుంది. అయితే డ్రగ్స్ లాంటి ఇల్లీగల్ పనులకు మారి దూరంగా ఉంటాడు. కానీ గ్యాంగ్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ జగన్ తమ్ముడుని కూడా కలుపుకుంటాయి మరో పక్క ఆటో డ్రైవర్ ఆనంది (సాయి పల్లవి) మారిని ప్రేమిస్తున్నా అని వెంట పడుతుంది. ఈ ప్రపంచంలో దేనికి భయ పడని మారి ఆనందిని చూసి భయపడుతుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మారిని చిత్రహింసలు పెట్టి చంపటానికి బిజ్జు అప్పటికే జైలు నుండి తప్పించుకుని మారి లైఫ్ ని నాశనం చేస్తుంటాడు. ఈ క్రమంలో చివరకి జగనే మారిని చంపటానికి ప్రయత్నిస్తాడు. అసలు ప్రాణ స్నేహితుడే మారిని ఎందుకు చంపాలి అనుకున్నాడు ? బిజ్జు మారినే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు ? మరి మారి వీటన్నిటిని ఎలా ఎదురుకున్నాడు ? ఫైనల్ గా బిజ్జుని ఎలా అంతం చేసాడా లేదా అనేదే మిగిలిన కథ !

విశ్లేషణ :
దర్శకుడు బాలాజీ మోహన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలు కూడా మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అసలు రెండు గ్యాంగ్ లకు మధ్య పుట్టే పగ కూడా అంత బలంగా అనిపించదు. మొదటి భాగంలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సరదాగా సాగినప్పటికీ.. సెకెండాఫ్ లవ్ ట్రాక్ ను ఇంకా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. పైగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా సాగతీసారు. ప్రధానంగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి.

నటీనటులు :
పవర్ ఫుల్ రౌడీ పాత్రలో నటించిన ధనుష్ ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు. పైగా ధనుష్ సిక్స్ ప్యాక్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.

అలాగే ఆటో డ్రైవర్ గా మరియు అల్లరి అమ్మాయి అయిన ఆనంది పాత్రలో నటించిన హీరోయిన్ సాయి పల్లవి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. పైగా ఎవరికీ భయపడని చలాకీ అమ్మాయిలా చాలా బాగా నటించింది. ముఖ్యంగా
మాస్ క్యారెక్టర్ లో ఉన్న ధనుష్ ని ఆమె ఆటపట్టించిన తీరు ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో వీరి కాంబినేషన్ చాల బాగుంది. హీరోకి ఫ్రెండ్ గా నటించిన నటుడు కూడా బాగా చేసాడు. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

టెక్నీషియన్స్ :
సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం చాలా బాగుంది. అయితే ఆయన అందించిన పాటలు మాత్రం ఆకట్టుకున్నే విధంగా లేవు. ఇక ఓంప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన చాల బాగా చిత్రీకరించారు. ప్రసన్నాఎడిటింగ్ కూడా పర్వాలేదు, ఇక నిర్మాత కూడా ధనుషే కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
ఫైనల్ గా ఈ చిత్ర దర్శకుడు బాలాజీ మోహన్ మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు. అయితే ఆ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నే ప్రయత్నం అయితే చేశాడు గాని అది పూర్తీ సంతృప్తికరంగా అనిపించదు.

చివరగా…
ఈ సినిమా పూర్తి ఆసక్తికరంగా ఆకట్టుకునే విధంగా సాగనప్పటికీ.. సినిమాలో అక్కడక్కడ కొన్ని మెప్పించే మాస్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సాగే కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్, అలాగే విశాల్ కి అతని కొడుకుకి మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, తెలుగు నేటివిటీకి సినిమా కొంచెం దూరంగా సాగడం.. కథకి తగ్గట్లు సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వంటి అంశాలు వల్ల సినిమా ఫలితం దెబ్బతింది. మొత్తంగా ఈ చిత్రం ‘బీ. సీ ప్రేక్షకులకు నచ్చుతుంది.