ఎన్నిక‌ల ముందు మారిన ఏపి సిఎం చంద్ర‌బాబు

50
Chandrababu naidu pawan kalyan
Chandrababu naidu pawan kalyan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి, వ్యవహారశైలి సార్వత్రిక ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయింది. అటు సంక్షేమంలోనూ ఇటు విప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో దూకుడుగా అడుగేస్తున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను సైతం త‌మ‌కు అనువుగా మ‌ర‌ల్చుకుని నాలుగున్న‌ర ఏళ్లుగా తాము ప‌డుతున్న క‌ష్టాన్ని ఏక‌రువు పెట్టారు ఆయ‌న. విప‌క్ష వైసిపిని టార్గెట్ చేయ‌డ‌మేగాక కేంద్రం నిధులు ఇవ్వ‌కుండా, హోదా ఇవ్వ‌కుండా, విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌కుండా చేస్తున్న కేంద్రంలోని బిజేపి చేస్తున్నఅన్యాయాన్ని నిల‌దీయ‌డంతో స‌మ‌ర్ధ‌వంతంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. కేంద్రంలోని విప‌క్ష పార్టీల మ‌ద్ద‌తుని కూడ‌బెట్టి తాజాగా చేసిన హ‌స్తిన దీక్ష‌తో దేశ వ్యాప్తంగా చంద్ర‌బాబు సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యారు.

అయితే సాంకేతికతను వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధి అంటూ ఆయన చెప్పే మాటల వేగం ఇటీవలి కాలంలో తగ్గింది. ఓట్లు రాల్చి పెట్టే సంక్షేమ పథకాల ప్రకటనల జోరు పెరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఆయన సంక్షేమంపై ఆసక్తికర, ఆకర్షణీయ ప్రకటనలు చేశారు. దానికి తోడు రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో రాష్ట్ర ప్రగతి కూడా చాలా కీలకమని జనం భావించడంతో ఆయనకు పట్టం కట్టారు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రప్రగతి, ఇబ్బందులను ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ పూర్తిగా జనం మద్దతును చంద్రబాబు చూరగొనలేక పోయారన్నది…ఇప్పుడు మారిన ఆయన శైలిని బట్టే అవగతమైపోతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకొచ్చిన ఈ సమయంలో ఆయన అభివృద్ధి గణాంగాలను ఘనంగా చెప్పడం కొంత తగ్గించి ప్రజాకర్షక సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రకటించడం, అమలు చేయడం ప్రారంభించారు. అంటే అభివృద్ధి మంత్రం ఓట్లను రాల్చదేమోనన్న అనుమానం ఆయనలో కలగడం వల్లనే ఇప్పుడీ బాట పట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు ఆ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టి, మరోసారి అధికారం అప్పగించడానికి ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమన్న విశ్లేషకుల మాటలను చంద్రబాబు విశ్వసిస్తున్నట్లుగా భావిస్తున్నారు. తాజాగా సిఎం చంద్రబాబు మారిన తీరు తెలుగుదేశం శ్రేణులనే సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే సంక్షేమ బాటే దగ్గరదారి అన్న అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన ప్రవేశ పెట్టిన కిలో రూ.2 బియ్యం పథకం తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో ఇచ్చిన మైలేజ్ అంతా ఇంతా కాదు. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన తరువాత మాత్రం సంక్షేమం కంటే ప్రగతి, అది కూడా సమగ్ర ప్రగతి అంటూ ప్రగతి దార్శనికుడిగా తనను తాను నిరూపించుకోవడాకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో సంక్షేమ పథకాలను మూలన పడేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం సిఎం చంద్రబాబు ఎడాపెడా సంక్షేమ పథకాలను ప్రకటించేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవి సత్ఫలితాలను ఇచ్చి మరోసారి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తాయా అన్నది తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.