ప‌ట్టాలెక్కిన దేశ తొలి సెమీ హై స్పీడ్ రైలు

59
Vande Bharat, Modi
Vande Bharat, Modi

దేశ తొలి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించారు. న్యూఢిల్లీ- వారణాసిల మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును రాక‌పోక‌ల‌ను సాగించ‌నుంది. ఈ రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర సభ్యులు రైలులో ప్రయాణించారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుంచి వారణాసికి 9 గంటల 40 నిమిషాల్లో చేరుకోనుంది. వందే భారత్ వెళ్లే మార్గాలైన కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెండు రైల్వేస్టేషన్ల వద్ద 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది. ఈ రైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా రాకపోకలు సాగించే ఈ రైలులో 1128 మంది ప్రయాణికులు కూర్చొనేలా సీట్లున్నాయి. 753 కిలోమీటర్ల దూరం ప్రయాణం కేవలం 8 గంటల్లో చేరుకునేలా రైలును ప్రవేశ పెట్టారు. ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్ డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్, వైఫై ఎంటర్‌టైన్‌మెంట్ సౌకర్యాలున్నాయి. ఈ రైలులో ప్రయాణించే వారికి విమాన ప్రయాణం అనుభూతి కలుగుతుంద‌ని అంటున్నారు.