ఇండియా వాంట్స్ రివేంజ్ పేరిట ప్ర‌జ‌ల‌ ట్వీట్లు

55
pulwama, CRPF
pulwama, CRPF

భార‌తీయుల ర‌క్తం కుత‌కుత‌లాడుతోంది. ఉగ్ర‌దాడిని దేశ ప్ర‌జ‌లంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌ళ‌మెత్తుతున్నారు. ఇండియా వాంట్స్ రివేంజ్ పేరిట ట్వీట్లు చేస్తున్నారు. స‌ర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి ముష్కర మూకల అంతుచూడాల‌ని ప్రచారం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ లోని పుల్వామా వ‌ద్ద‌ టెర్రరిస్టులు దొంగదెబ్బతీసి మారణహోమం సృష్టించారు. యురీ దాడి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో జవాన్లు బలైన అత్యంత విషాదకర ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది.

ఆర్పీఎఫ్ జవాన్లను ల‌క్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడిలో మృతులు గంట గంటకు పెరుగుతూనే ఉన్నారు. ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుడుతో ఇప్పటి వరకు 42మంది జవాన్లు మృతిచెందారు. మరో 10మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై బాంబు దాడి చేసి మిగిలిన జవాన్లు స్పందించే లోపే ఉగ్రవాదులు గ్రెనేడ్లు, తుపాకులతో బుల్లెట్‌ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల ధాటికి జవాన్ల వాహనాలు గాల్లో ఎగిరి ముక్కలు ముక్కలుగా ధ్వంసమయ్యాయి. శరీర భాగాలు తెగిపడ్డగా ఎక్కడ చూసినా రక్తపు మరకలు, మాంసపు ముద్దలతో సంఘ‌ట‌నా స్థ‌లంలో భీతావహకంగా మారింది. జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉండగా అందులో 2500 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్నట్లు స‌మాచారం. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ దాదాపు 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఒక బస్సును ఢీకొట్టాడు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించిందని అంటున్నారు ప్రత్యక్షసాక్షులు. ఈ ఘటనతో జమ్మూకశ్మీర్ లో హై అలర్ట్‌ ప్రకటించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తామే ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రకటించింది. దాడి జరిగిన కొన్ని నిమిషాల తర్వాత జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అదిల్‌ అహ్మద్‌ మాట్లాడిన ఒక వీడియోను విడుదల చేసింది.

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఈ దాడి హేయమైన చర్యగా ఆయ‌న పేర్కొన్నారు.ఈ పిరికిపంద చర్యను ఖండిస్తున్నామని అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మత్యాగం వృథా కాబోదని, మృతవీరుల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందన్నారు మోదీ. ఇటు కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ శుక్ర‌వారం శ్రీనగర్ లో పర్యటించనున్నారు.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)